చంద్రబాబు పాలనలో అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Jun 11 2026 12:19 AM | Updated on Jun 11 2026 12:19 AM

పార్వతీపురం రూరల్‌ : రాష్ట్రంలో సాగుతున్న చంద్రబాబు పాలనలో అవినీతి ఏ రకంగా జడలు విప్పిందో, అధికారుల ఇష్టారాజ్యం ఏ స్థాయికి చేరిందో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే స్వయంగా బట్టబయలు చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో విద్యా శాఖ అధికారుల అక్రమ సంపాదనే ధ్యేయంగా సాగుతున్న వ్యవహారాలపై సొంత పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఈఓ కార్యాలయంలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలోనే అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయి పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.

నిబంధనలను కాదని.. బంధుప్రీతికి పీఠం

విద్యా శాఖలో ప్రక్షాళన జరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, లోపల మాత్రం నిధుల దోపిడీ నిరాటంకంగా సాగుతోందని ఎమ్మెల్యే ఆరోపణల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీన ‘యూనిక్‌ కనస్ట్రక్షన్‌’ అనే ప్రైవేట్‌ సంస్థకు డీఈఓ కార్యాలయం నుంచి ఏకంగా రూ.19 లక్షల 55 వేలను నేరుగా బదిలీ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారుల బంధువులకు ఇలాంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, సదరు కార్యాలయంలోనే పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుని భార్యకు చెందిన సంస్థకు ఈ నిధులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

యోగా మ్యాట్లు ఏవి? నిధులు ఏమయ్యాయి?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యోగాంధ్రా పేరుతో ఈ నిధుల మాయాజాలం సాగిందని ఎమ్మెల్యే విజయ్‌చంద్ర వివరించారు. విద్యార్థుల కోసం యోగా మ్యాట్లు, టీ షర్టులు కొనుగోలు చేసేందుకు ఈ నిధులను విడుదల చేసినప్పటికీ, సొమ్ము చెల్లించి 45 రోజులు దాటినా ఇంతవరకు ఆఫీసుకు ఒక్క మ్యాట్‌ కానీ, టీషర్టు కానీ రాలేదని ఆరోపించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి కనీసం టెండర్‌ ప్రక్రియ నిర్వహించారా, కొటేషన్లు పిలిచారా, ఎల్‌–1గా ఎలా ఖరారు చేశారు అనే వివరాలు కూడా లేవని, అధికారులు ఇష్టానుసారంగా నిధులను దండుకుంటున్నారని విమర్శించారు.

గుట్టు రట్టు చేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల

డీఈఓ కార్యాలయంలో నిధుల గోల్‌మాల్‌పై మండిపాటు

సొంత వారికే రూ.19.55 లక్షల దోపిడీ

జిల్లా విద్యా శాఖపై సంచలన

ఆరోపణలు

పత్రాలు ఇవ్వకుంటే నేరుగా కార్యాలయానికే..

ఈ అక్రమ వ్యవహారాలపై గత నెల రోజులుగా డీఈఓను వివరణ కోరుతున్నా ఆయన సమాధానం దాటవేస్తున్నారని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ప్రొక్యూర్మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని, ఈ దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారుల అవినీతి పత్రాలను తాము లిఖితపూర్వకంగా అడిగామని, రేపటికల్లా ఆ డాక్యుమెంట్లను బయటపెట్టకపోతే తామే స్వయంగా డీఈఓ ఆఫీసుకు వెళ్లి ఫైళ్లను స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. సొంత పార్టీ అధికారంలో ఉండీ, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో అవినీతిపై వీధికెక్కి ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement