జియ్మమ్మవలస(రూరల్): మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పద్దుల కింద ఉన్న రూ.పది లక్షల నిధులను ఎంపీడీవో హనుమంతు శశిభూషణరావు దుర్వినియోగం చేశారన్న విషయమై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి బుధవారం విచారణ చేపట్టారు. గడిచిన నాలుగు రోజులుగా ఎంపీడీవో విధులకు హాజరు కాకపోవడం, సీనియర్ అసిస్టెంట్ కె.రామారావు కూడా అనారోగ్యం పేరిట విధులకు హాజరు కాకపోవడంతో ఓఎస్‌టీడీ చొక్కాపు శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ప్రసాద్‌ల స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. దీనిపై తగు చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఇదిలా ఉండగా ఎంపీడీవో కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై సాక్షిలో బుధవారం ప్రచురితమైన ‘ఎంపీడీవో కార్యాలయంలో వార్’ కథనం చర్చనీయాంశమైంది. ఈ నిధుల విషయమై కార్యాలయంలోనే ఉద్యోగుల మధ్య కొట్లాట జరిగిందన్న తీరు.. దీని వెనుక ఓ రాజకీయ నాయకుడి ప్రోద్బలం ఉందనే విషయాలు వెలుగులోకి రావడం.. ఈ క్రమంలో విచారణ జరగడం ఆసక్తికరంగా మారింది. మున్ముందు ఏం జరగనుందో వేచి చూడాలి.
వసతిగృహాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: జిల్లా రూరల్ పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్టు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ) వీఎల్‌ఎం స్వరూప్‌కుమారి తెలిపారు. ఈమేరకు ఎస్సీ విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పరిధిలో మొత్తం తొమ్మిది సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయని, వాటిలో ఆరు ప్రీ మెట్రిక్, మూడు పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రీ మెట్రిక్ వసతిగృహాలలో బొండపల్లి బాలికల వసతి గృహంలో 50 సీట్లు, గజపతినగరం బాలికల వసతిగృహంలో 72 సీట్లు, గర్భాం బాలుర వసతిగృహంలో 75 సీట్లు, గంట్యాడ బాలుర వసతిగృహంలో 16 సీట్లు, లోగిస బాలుర వసతిగృహంలో 200 సీట్లు ఉన్నాయని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల (ఇంటర్మీడియట్ మరియ ఆపై తరగతులు)లో గజపతినగరం బాలికల వసతిగృహంలో 55 సీట్లు, గజపతినగరం బాలుర వసతిగృహంలో 74 సీట్లు, చీపురుపల్లి బాలుర వసతిగృహంలో 50 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత వసతిగృహాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
నిబద్ధతతో పనిచేస్తేనే సత్ఫలితాలు
● జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి
డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ
విజయనగరం అర్బన్: ఏ రంగంలోనైనా నిబద్దతతో పని చేస్తేనే మంచి విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అన్నారు. స్థానిక గురజాడ పాఠశాలలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదికతో తమకున్న సుదీర్ణ ప్రయాణాన్ని అనుభవాలను పంచుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ సమాజ శ్రేయస్సు కోసం అనేక విజయాలను సాధించామని వారు గుర్తు చేసుకున్నారు. సంస్థ దివంగత నాయకులు పల్లి తిరుపతిరావు, మండల సత్యనారాయణ జేవీవీ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, జన్మభూమి వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జనవిజ్ఞాన వేదిక చేసిన కృషి ఎనలేదని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మిరియాల కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పైల రమేష్ రాజు, సుజాత, యోహాన్, జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, జిల్లా ట్రెజరర్ శివాజీ, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


