పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Jun 11 2026 12:19 AM | Updated on Jun 11 2026 12:19 AM

జేసీ సేతుమాధవన్‌

విజయనగరం అర్బన్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ జిల్లాలో అమలవుతున్న వివిధ రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ వివాదాల పరిష్కారానికి అత్యంత కీలకమైన ‘రీసర్వే’ పురోగతి, జాయింట్‌ ఎల్‌పీఎంల ప్రక్రియపై ప్రత్యేక సమీక్ష జరిపారు. రీ సర్వే పనుల్లో వేగం పెంచాలని ఎక్కడా జాప్యం జరగకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సర్వే విభాగాన్ని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితా దరఖాస్తుల స్థితిగతులపై ఆరా తీశారు.

తహసీల్దార్‌, ఆర్డీవో అర్హమైన వాటికి వెంటనే ఆమోదం తెలపాలని స్పష్టం చేశారు. రైతులకు ఉపయోగపడే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ, ఈ–కేవైసీ ప్రక్రియపై జేసీ ప్రత్యేక దృష్టి సారించారు. జనవరి నుంచి ఆగస్టు వరకు మంజూరైన పాస్‌ పుస్తకాల పంపిణీ స్టేటస్‌ను సమీక్షిస్తూ ఇంకా ఈ–కేవైసీ పూర్తికాని రైతుల వివరాలను సేకరించి నూరు శాతం ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ‘రెవెన్యూ క్లినిక్‌ల’ పనితీరును మెరుగుపరిచి ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా వచ్చిన అర్జీలపై జాయింట్‌ కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని భూముల బదిలీలు, మ్యుటేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు, జిల్లాలోని ఆర్డీవోలు, సెక్షన్‌ అధికారులు, తహసీల్దార్లు పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement