● సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్
డెంకాడ : మండలంలోని మోదవలస ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి టి.రజని రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. మోదవలస పంచాయతీలోని ఒక కేసులో 12 మందికి సాల్వెన్సీ పత్రాలు మంజూరుకు లంచం డిమాండ్ చేసిన మోదవలస ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి టి.రజనిని బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏసీబీ అడిషినల్ ఎస్పీ ఎన్.రమ్య, డీఎస్‌పీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలంలోని గుణుపూరుపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న టి.రజని, ప్రస్తుతం మోదవలస పంచాయతీకి ఇన్‌చార్జ్ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలో మోదవలస పంచాయతీ పరిధిలోని ఒక కేసు విషయమై కోరాడ నాగరాజుతో పాటు 12 మంది సాల్వెన్సీ సర్టిఫికెట్‌ల కోసం కొద్ది రోజులుగా ఆమె వద్దకు తిరుగుతున్నారు. ఆమె సర్టిఫికెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో కోరాడ నాగరాజు ఏసీబీని ఆశ్రయించాడు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నాగరాజు నుంచి 12 సాల్వెన్సీ సర్టిఫికెట్లకు పంచాయతీ కార్యదర్శి రజని రూ.30వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


