కురుపాంలో దొంగల హల్‌చల్
● ఒకే రాత్రి రెండిళ్లలో చోరీ
● మరో ఇంట్లో చోరీకి ప్రయత్నం
● ఉలిక్కిపడిన కురుపాం
కురుపాం: కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం పోలీస్‌స్టేషన్ ముందు, భారతీయ స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కొత్తకోట మల్లికార్జునరావు ఇంటి ముందు గేటు తీసి ఇంటి సేఫ్టీ గేటు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన దొంగలు చెక్క తలుపులు తాళం తీయలేకపోయారు. తరువాత మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న జామి దేవీప్రసాద్ ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి అందులో నగదు, నగలు దోచుకున్నారు. అలాగే ప్యాలెస్‌రోడ్డులో ఉన్న కందుల శ్రీనివాసరావు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో నగలన్నీ దోచుకోపోయారు. బాధితులు కురుపాంలో అందుబాటులో లేకపోవడంతో ఎంత విలువైన బంగారు నగలు, వెండి, నగదు దోచుకుపోయిందీ తెలియరాలేదు. కురుపాం ఎస్‌ఐ పి.నారాయణరావు, ఎల్విన్‌పేట సీఐ హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారంతో కురుపాం చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఆధారాలు సేకరిస్తున్నామని సమగ్ర దర్యాప్తు చేస్తామని సీఐ హరి తెలిపారు.
కురుపాంలో దొంగల హల్‌చల్


