చెరకు రైతుకు ప్రోత్సాహకాలు అందించాలి
● చెరకు రైతులు, కర్మాగార ప్రతినిధుల
సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్: రైతులు చెరకు సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేయాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. చెరకు రైతుకు అన్ని రాష్ట్రాల్లోనూ రవాణా చార్జీల రూపంలో ప్రోత్సాహక నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో టన్నుకు రూ.450 వరకు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ప్రోత్సాహక ప్రతిపాదనలు అమలు చేస్తున్నారని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘చెరకు సాగు, రైతుల పరిస్థితుల’పై సంకిలి చెక్కర కర్మాగారం ప్రతినిధులు, చెరకు సాగుచేసే ప్రాంతాల ప్రజాప్రతినిధులు, రైతులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చెరకు రైతుకు, కర్మాగారానికి రెండింటికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. పంటల మార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో సుమారు 4 వేల హెక్టార్లలో చెరకు సాగు జరుగుతుండగా దాన్ని కనీసం 10 వేల హెక్టార్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ గతంలో జిల్లాలో చెరకు విరివిగా పండేదని, చెక్కర కర్మాగారాలు పనిచేసిన కాలంలో రైతులు ఆ పంటవైపు మొగ్గు చూపేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థితిని తిరిగి తీసుకురావాలని, రైతులకు చెరకు సాగు లాభాదాయకమనే భరోసా కల్పిస్తే వారు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. సంకిలి చక్కెర కార్మగారం ఈ ఏడాది మూసివేస్తారనే వదంతులు వ్యాప్తి చెందాయని, అది ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టమని విమర్శించారు. ఈ ఏడాది కర్మాగారానికి కనీసం 4 లక్షల టన్నుల చెరకు సరఫరా అయ్యేలా రైతులకు అవగాహన కల్పిస్తామని కర్మాగారం నుంచి అవసరమైన ఇన్‌పుట్స్ అందించే విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంకిలి కర్మాగారం ప్రతినిధులు మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెరకు సాగు క్రమంగా తగ్గిపోతోందని వివరించారు. చెరకు నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండడం, చెల్లింపులు ఆలస్యంగా జరగడం వల్ల రైతులు మొక్కజొన్న, ఆయిల్‌పామ్ వంటి ఇతర పంటల వైపు మళ్లుతున్నారని తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు, కర్మాగారం ఇద్దరికీ లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, పంటల మార్పిడిని పోత్రహిస్తూనే చెరకు సాగును పెంచాలని సూచించారు. ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), కోండ్రు మురళీమోహన్ (రాజాం), బేబీ నాయన (బొబ్బలి) మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించాలని, సకాలంలో కటింగ్, మంచి సీడ్, ఆర్థిక సహాయం అందించాలని కర్మాగార ప్రతినిధులను కోరారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, శ్రీకాకుళం, మన్యం జేసీలు వర్చువల్‌గా పాల్గొన్నారు. మూడు జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలు రామారావు, అన్నపూర్ణ, త్రినాథస్వామి, కేన్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.


