మహిళా స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి కృషి
విజయనగరం టౌన్: దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లోని ఉప పథకం కింద అజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన పథకం అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఉన్న కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు, సంఘ ప్రతినిధులకు దీనిపై శనివారం అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం, ఎస్‌హెచ్‌జీ సభ్యులు తమ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు తరలించడానికి సహాయపడటం పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రజా సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి, భాస్కరరావు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు మాధవి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన డీపీఎంలు, ఏపీఎంలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


