‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
విజయనగరం గంటస్తంభం: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని, కార్మికుల హక్కులను కాలరాస్తూ నిధులను కత్తిరిస్తున్నదని ఆరోపిస్తూ రామకృష్ణనగర్‌లో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జీఓను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో ముందుగా మహాత్మాగాంధీ పేరును తొలగించిందని, ఇప్పుడు పథకాన్నే నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్మించారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందించేదని, తాజా నిర్ణయంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం ద్వారా రాష్ట్రాలపై భారం మోపుతోందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో 125 రోజుల పని దినాలు పెంచామని చెప్పి, మొత్తం 60 వేల కోట్ల రూపాయల నిధుల్లో 20 వేల కోట్లు కత్తిరించడం మోసపూరిత చర్య అని విమర్మించారు. పని దినాలు ఉన్నా నిధులు లేకపోతే ఉపాధి కల్పన ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.రమణమ్మ, బి.రమణ, పుణ్యవతి, ఎం.శాంతమూర్తి, ఎం.జగదాంబ పాల్గొన్నారు.


