ఉపాధ్యాయుల హక్కుల కోసం ఏపీటీఎఫ్ ఆందోళన
● విద్యాహక్కు చట్టంలో వెంటనే సవరణలు చేయాలి
● సుప్రీం తీర్పుతో ఉపాధ్యాయుల్లో తీవ్ర
ఆందోళన
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్–1938) విజయనగరం జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి ఎన్‌వి.పైడిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ, 2010వ సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టీఈటీ పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆందోళన సృష్టంచిందని తెలిపారు. ఈ తీర్పుపై పునఃపరిశీలన కోసం..ఉపాధ్యాయుల సమాఖ్య తరఫున ఇప్పటికే తిరిగి విచారణ చేయాలని విజ్ఞప్తి పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరిగి విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టానికి వెంటనే సవరణలు చేయాలని, ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల్లో మార్పులు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుల సమాఖ్య డిమాండ్ చేసింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్మి ఎన్‌వీ.పైడిరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ ఆర్.కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, జిల్లా సహాధ్యక్షురాలు ఎన్.శ్రీదేవి, అదనపు కార్యదర్మి ఏవీ.శ్రీను, ఉపాధ్యక్షులు మూర్తి, రామారావు, సత్యనారాయణ, విజయనగరం మండలం అధ్యక్షుడు సీహెచ్.పైడితల్లి, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.


