పార్శిల్ పేలుడు బాధితుడికి ఆర్థిక సాయం
● రూ.50వేలు అందజేసిన మజ్జి సిరిసహస్ర
పార్వతీపురం రూరల్: ఇటీవల పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్శిల్ కౌంటర్ వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రెడ్డి రమేష్‌కు చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ అపన్నహస్తం అందించింది. ఆ సంస్థ అధినేత ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరిసహస్ర జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రమేష్‌ను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ద్వారా విషయాన్ని తెలుసుకుని తన తండ్రి సూచన మేరకు పరామర్శించినట్లు ఆమె తెలిపారు. చిన్న శ్రీను సోల్జర్స్ తరఫున ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పరామర్శకు ముందు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును తన క్యాంపు కార్యాలయంలో కలిసి ముచ్చటించారు. కార్యక్రమంలో ఆమెతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ కొండపల్లి రుక్మిణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షుడు గొర్లి మాధవరావు, కౌన్సిల్ సభ్యులు సంగం రెడ్డి లక్ష్మీపార్వతి, సువ్వాడ లావణ్య, యడ్ల త్రినాథ, నాయకులు చింతాడ శైలజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


