కంటితుడుపు వైద్యం
● బాధితుల నరకయాతన
● ఆర్టీసీ పేలుడు బాధితుడు చేతి నుంచి రాయి బయటకు తీసిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు
పార్వతీపురం రూరల్: జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేస్తూ కుదిపేసిన ఆర్టీసీ పార్శిల్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన బాధితులకు నరకయాతన తప్పడం లేదు. తమకేమీ సంబంధం లేని ఓ ఘటన వారిని ఆస్పత్రి పాలు చేసి వారికి, కుటుంబసభ్యులకు తీవ్రమైన బాధను మిగిల్చింది. అయితే బాధితులకు పెద్ద ఆస్పత్రిలో సైతం భరోసా కరువైంది. బాధితుల్లో ఒకరైన రెడ్డి రమేష్ (కలాసీ) వైద్య సేవల్లో ఎదురైన పరాభవం పభుత్వ వైద్య సేవల తీరుకు అద్దం పడుతోంది. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్‌ను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా సుమారు వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అక్కడి వైద్యుల నుంచి కనీస స్పందన కరువైంది. సరైన చికిత్స అందించకుండానే కంటి తుడుపుగా సేవలందించి తమకేమీ పట్టనట్లు డిశ్చార్జ్ చేశారని రమేష్ చెల్లి వాపోయింది. గత నెల 27న ప్రైవేట్ అంబులెన్స్‌లో చేసేది ఏమీ లేక అర్ధరాత్రి పార్వతీపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవుడిపై భారం వేసి జిల్లా కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో వెలికితీసిన రాళ్లు
సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు రమేష్ రెండు కాళ్లను పరిశీలించి శరీరంలో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స అందించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. అలాగే రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేసి పేలుడు సమయంలో శరీరంలోకి వెళ్లిన రాళ్లను బయటకు తీశారు. దీంతో కేజీహెచ్‌లో చేసిన కంటి తుడుపు వైద్యం తేటతెల్లమైంది. తాజాగా ఆదివారం రమేష్ చేతికి చేసిన శస్త్రచికిత్సలో అంగుళం పరిమాణంలో ఉన్న మరో రాయిని బయటకు తీయడం గమనార్హం. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు అందించిన సేవలు చూస్తుంటే ప్రభుత్వ వైద్యసేవలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయని, దానికి ఉదాహరణ బాధితుడు రమేష్‌కు చేసిన శస్త్రచికిత్స అని పలువురు విమర్శిస్తున్నారు.
కంటితుడుపు వైద్యం


