ఘనంగా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము గ్రామంలో ఆదివారం ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) ఆవిర్భావ దినోత్సవంతో పాటు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాడంగి సత్యనారాయణ మాట్లాడుతూ బిర్సా ముండా స్ఫూర్తితో తమ సంఘం పోరాటాలు చేస్తుందన్నారు. ఈనెల 15వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. రద్దయిన జీవో నంబర్ 3 స్థానంలో ఏజెన్సీలో ఉద్యోగ నియామక చట్టం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న టీచర్స్, సీఆర్‌టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సభ్యురాలు భారతి, గోవింద్, ముత్యాలు, వెంకటేశ్వర్లు, భగవాన్, రవి, యోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


