డీఎస్సీ ఎంపికలో అన్యాయం
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఎంపికలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని చీపురుపల్లి మండలంలోని వంగపల్లిపేటకు చెందిన బాడీబిల్డర్ రెడ్డి లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందని వాపోయాడు, తనకు జాతీయ స్థాయిలో బాడీబిల్డింగ్‌లో అర్హత ఉందని, అదే అర్హతతో టీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. రాత పరీక్షలో అర్హత సాధించిన తన పేరును 1:5 నిష్పత్తిలో ప్రభుత్వం తయారు చేసిన మెరిట్ జాబితాలో 55వ ర్యాంకర్‌గా తన పేరు ఉందని, ఈ మేరకు 2025 ఆగస్టు 2న విజయవాడలో తన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయ్యిందని తెలిపాడు. ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికై నట్లు భావించిన తాను ఎంతో సంతోషించానని ఇంతలో సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన ఫలితాల్లో తన పేరు లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. క్రీడాకారుల కోటాలో 55వ ర్యాంకులో ఉన్న తనకు ఉపాధ్యాయ పోస్టు ఇవ్వకుండా 96వ ర్యాంక్‌లో ఉన్న వ్యక్తిని ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎలా ఎంపిక చేశారో అర్థం కాలేదన్నారు. అంతేకాకుండా స్థానిక కోటాలో ఉన్న తనను తప్పించి అంతర్ జిల్లాకు చెందిన 96వ ర్యాంకర్‌ను ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందని, అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఇచ్చిన వెబ్‌సైట్‌లో తన సమస్య పొందుపరిచినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరాడు.
జాతీయ బాడీబిల్డర్ ఆవేదన


