నేల రాలిన ఆశలు
టమాట రైతుల కుదేలు మోంథా తుఫాన్ దెబ్బతో తీవ్ర నష్టం జిల్లాలో 300 ఎకరాల్లో సాగు కలిసి రాని దిగుబడి రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని కన్నీరు దెబ్బతిన్న పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలి
తుఫాన్‌తో తెగుళ్లు వాస్తవమే..
రామభద్రపురం:
మోంథా తుఫాన్ రైతులను కన్నీటి సంద్రంలో ముంచింది. చేతికొచ్చిన వివిధ రకాల పంటలు తుఫాన్ దెబ్బకు భారీగా దెబ్బతిన్నాయి. రూ.లక్షల పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన టమాట రైతుల ఆశలు గల్లంతయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 నుంచి 300 ఎకరాలలో రైతులు టమాట పంట సాగు చేస్తున్నారు. మోంథా తుఫాన్ కారణంగా మడుల్లో నీరు నిల్వ ఉండి ఆరుతున్న కొద్ది మొక్కలు చనిపోతున్నాయి. నీరు పట్టని తోటల్లో నల్లమచ్చలు, గజ్జి రోగాలు వంటి తెగుళ్లు సోకి పూత, పిందె, కాయలు రాలిపోతున్నాయి. ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా తెగుళ్లతో తోటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతున్నారు. తెగుళ్ల దెబ్బకు దిగుబడి బాగా తగ్గిపోవడంతో పాటు కాయల నాణ్యత తగ్గిన టమాటాలను మార్కెట్లో కొనేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పుంజుకుంటున్నాయి. 20 రోజుల కిందట వరకు 25 కేజీల క్రేట్ ధర రూ.300 లోపు ఉండగా ప్రస్తుతం రూ.550 వరకు ధరలు పలుకుతున్నాయి. ధరలు పుంజుకుంటున్నా పంట దిగుబడి మాత్రం తుఫాన్ దెబ్బతో సోకిన తెగుళ్ల కారణంగా సగానికి పైగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పంటలు ఏపుగా పెరిగాయి..పంట దిగుబడి పెరిగి నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు అనుకుని సంబర పడిన రైతన్నలకు చేతికందివస్తుందన్న సమయంలో మోంథా తుఫాన్ ధాటికి పాడైపోయాయి. టమాట పంటపై పెట్టుకున్న ఆశలు నిరాశే అయ్యాయని రైతులు వాపోతున్నారు. దెబ్బతిన్న పంటలను చూస్తూ రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. తుఫాన్ దెబ్బకు రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసి నష్టపోయా మని కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని వాపోతున్నారు. దెబ్బతిన్న పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. టమాట పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మోంథా తుఫాన్ ప్రభావం కారణంగా అధిక వర్షాలు కురవడంతో టమాట పంటకు బాక్టీరియాతో తెగుళ్లు సోకడం వాస్తవమే. తుఫాన్ వదిలిన తర్వాత పంటలను పరిశీలించాం. చీడపీడలు, తెగుళ్లు సోకిన టమాట పంటకు ఏ మందు పిచికారీ చేయాలో సూచించాం. ఎండుకుళ్లు తెగులు నివారణకు సీవోసీ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ 2 గ్రాములు చొప్పున్న 10 లీటర్ల నీటికి కలిపి మొక్క మొత్తం, మరియు మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం కోసం నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం.
– పి.మోహనకృష్ణ, మూడు మండలాల
ఉద్యాన శాఖాధికారి
నేల రాలిన ఆశలు
నేల రాలిన ఆశలు


