
అమ్మవారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు
విజయనగరం: పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని విజయనగరం నగర పాలక సంస్థ ప్రజారోగ్యాధికారి డాక్టర్ కె.సాంబమూర్తి అన్నారు. ఈ నెల 14న మంగళవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశామని తెలిపారు. నగరంలోని వనంగుడి ప్రాంతంలో ఉన్న ఘాడీఖాన సమీపంలో ఉన్న పెద్ద చెరువు గట్టు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమాలను గురువారం చేపట్టారు. ముఖ్యంగా తెప్పోత్సవానికి ప్రారంభ వేదికగా ఉన్న గట్టు ఇతర ప్రాంతాల్లో చెత్త చెదారాలను తొలగిస్తున్నారు. జాతరలు, ఉత్సవాల సమయంలో ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన అంశమని ఆయన అన్నారు. పారిశుధ్య పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
13నుంచి ఐద్వా రాష్ట్ర మహాసభలు
విజయనగరం గంటస్తంభం: మహిళా హక్కుల కోసం నిరంతర పోరాటం సాగిస్తున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర స్థాయి 16వ మహాసభలు ఈ నెల 13, 14, 15 తేదీలలో అనంతపురంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ నగర్‌లో గురువారం ఐద్వా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఐద్వా మహిళా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ సమాజంలో మార్పు తీసుకువస్తోందని తెలిపారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహిళలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పుణ్యవతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ యువతకు ఉద్యోగ అవకాశాలు
విజయనగరం టౌన్: నిరుద్యోగ మైనారిటీ యువతకు హోమ్‌కేర్ నర్స్ ఉద్యోగాలకి సంబంధించి ఓవర్సీస్ మెన్ పవర్ కంపెనీ ఖతర్, దోహా దేశాల్లో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ, జీఎన్‌ఎం అర్హత కలిగి 21 నుంచి 40 ఏళ్లలోపు సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పాస్‌పోర్ట్, విద్యార్హతల సర్టిఫికెట్, అనుభవం సర్టిఫికెట్ తప్పనిసరన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లో ఉన్న మైనారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
భగవద్గీత ఆధునిక యువతకు జ్ఞానదీపిక
విజయనగరం టౌన్: ఆధునిక యువతకు భగవద్గీత ఒక జ్ఞానదీపికని, దాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుసరించాలని ప్రముఖ ఆధ్యాత్మిక శిరోమణి, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై కామరాజ్ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె గురువారం ప్రసంగించారు. భగవద్గీత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, దాని ప్రకారంగానే మానవ మనుగడ అభివృద్ధి దిశలో అడుగులేస్తుందన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు ఆమెను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆమెకు జిల్లాలోని పలువురు అభినందనలు తెలిపారు.

అమ్మవారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు

అమ్మవారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు