
దగాపడ్డ అన్నదాత!
తన పొలంలో సగం కంకులు బయటకు వచ్చాయని చూపుతున్న రైతు వసంతల బంగారునాయుడు
రామభద్రపురం:
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న అన్నదాతకు అటు ప్రకృతి, ఇటు చీడపీడలతో కష్టాలు తప్పడం లేదు. ఇదే సమయంలో నాసిరకం విత్తనాలు వేసి పంటలు దిగుబడులు లేక అన్నదాత మరింత గగ్గోలు పెడుతున్నాడు. గత ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు కూడా నాణ్యమైనవేనని రైతన్నలు నమ్మారు. తాము తెచ్చిన విత్తనాలు నాసిరకం విత్తనాలు అని తెలుసుకోలేకపోయారు. వ్యవసాయాధికారులు 1121 రకం తక్కువ కాలంలో పంటకొస్తుంది.. 125 రోజులలో పంట కోసుకోవచ్చు అనేసరికి ఆనంద పడ్డారు. కానీ కాల పరిమితికి ముందు 30 నుంచి 40 శాతం వరకు దుబ్బులు నుంచి కంకులు బయటకు వచ్చేశాయి. అంతే కాకుండా వీటిలో 20 శాతం వరకు కంకులు పూర్తిగా పండిపోయి ఎర్రబారాయి. మిగిలిన 60 శాతం నుంచి 70 శాతం వరకు కొన్ని దుబ్బులు పొట్ట దశ, మరికొన్ని దుబ్బులు చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఈ 60 నుంచి 70 దుబ్బులు కంకులు బయటకు వచ్చేందుకు దాదాపు 15 రోజులు పైబడి పడుతుంది. ఈ లోగా పూర్తిగా పండిపోయిన కంకులలోని గింజలు పూర్తిగా రాలిపోతాయి. చిరు పొట్ట దశలో ఉన్న మొక్కల నుంచి కంకులు బయటకు వచ్చేసరికి పొట్టదశలో ఉన్న కంకులు పూర్తిగా బయటకు వచ్చేసి ముదిరి రాలిపోయే అవకాశం లేకపోలేదు. దాంతో దిగుబడి పూర్తిగా పడిపోయి రైతులు నష్టాలు చవిచూడక తప్పదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2600 ఎకరాలలో 1121 రకం సాగు..
రామభద్రపురం మండలంలో ఏపీ సీడ్స్ సంస్థ సుమారు 803 క్వింటాళ్ల 1121 రకం వరి విత్తనాలు ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు సరఫరా చేయగా 2600 ఎకరాలలో నాట్లు వేసినట్టు అధికార సమాచారం. గత ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసే ముందు సర్టిఫై చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించేది. ప్రస్తుతం సాగులో ఉన్న 1121 రకం వరి పంటలు చూస్తే అసలు ఈ ప్రభుత్వం సర్టిఫై చేయకుండా నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేసినట్లుందని రైతులు విమర్శిస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్క ప్రకారం సాధారణంగా 1121 రకం వరి దాదాపు 125 రోజులకు పంటకొస్తుంది. అయితే పంట ప్రస్తుతం కొన్ని దుబ్బులు కంకులు బయటకు వచ్చి పండేస్తున్నాయి. మరి కొన్ని దుబ్బులు అసలు కంకులే బయటకు రాలేదు సరికదా పొట్టదశకు రాకపోవడం చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు.
పరిశీలించిన ఏపీ సీడ్స్, వ్యవసాయాధికారులు
1121 రకం వరి సాగులో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్న విషయాన్ని సాక్షి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దాంతో వ్యవసాయ శాఖ ఏవో ఎం.శివ, ఏపీ సీడ్స్ ఫీల్డ్ సూపర్‌వైజర్ పల్లి చంద్రశేఖర్ రైతు పొలంలోకి వెళ్లి పరిశీలించారు. రైతు చెప్పినట్టుగానే కొన్ని దుబ్బులు కంకులు రావడం, మరి కొన్ని దుబ్బులకు కంకులు రాకపోవడం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.
దిగుబడి తగ్గిపోతుంది..
ఆర్‌ఎస్‌కేలో కొనుగోలు చేసిన నాసికం వరి విత్తనాలు నాటి మోసపోయాను. ఎకరా 50 సెంట్లు భూమిలో 1121 రకం వరి వేశాను. ఎకరా విస్తీర్ణంలో పొట్టదశలో ఉంది. మిగతా 50 సెంట్లు మడిలో సగం కంకులు వచ్చి పండిపోతున్నాయి. మిగతా సగం పొట్టదశలో ఉంది. పూర్తిగా కంకులు వచ్చేసరికి ముందుగా వచ్చిన కంకులలో గింజలు రాలిపోతాయి. వేలాది రూపాయిలు పెట్టుబడి పెట్టాను. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడ్డాం. చివరకు దిగుబడిపై ప్రభావం చూపడంతో నష్టపోతున్నాం.
– చుక్క అప్పలనాయుడు, రైతు, రామభద్రపురం

దగాపడ్డ అన్నదాత!