
రహదారి భద్రత నియమాలు పాటించాలి
● జిల్లా రవాణా శాఖాధికారి
టి.దుర్గాప్రసాద్ రెడ్డి
పార్వతీపురం రూరల్: వాహన దారులు కచ్చితంగా రహదారి భద్రత నియమాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా సహాయ రవాణా శాఖాధికారులు బి.కాశీరాం నాయక్, స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గతో కలిసి మండలంలోని నర్సిపురం గ్రామం సమీపంలో అంతర్‌రాష్ట్ర రహదారిపై గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిమితికి మించి అధిక ప్రయాణికులతో వెళ్తూ భద్రత నియమాలను అతిక్రమించిన 11 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అలాగే మూడు వాహనాలను, 12 ఆటోలతో పాటు ఒక లైట్ గూడ్స్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రూ.30వేలు జరిమానాను వాహనాలకు విధించారు. అలాగే రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై వాహన దారులకు, పాదచారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తూ ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్ విధిగా ధరించాలని జిల్లా రవాణా శాఖాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి సూచించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయరాదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో రవాణాశాఖ కానిస్టేబుల్స్, హోం గార్డులు తదితర సిబ్బంది ఉన్నారు.