
బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించండి
పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు వంటివి అమలు చేయాలని ఆగస్టు 2న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఇతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైస్కూల్ ప్లస్‌లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలని కోరారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని కోరారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఈ సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో జనరల్ సెక్రటరీ ఎస్.చిరంజీవి, కో చైర్మన్లు కె.నరహరి, మనోజ్ కుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.