
ఇదెక్కడి అన్యాయం?
రాజాం సిటీ: రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గా ఆలయానికి ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతున్న తనను తప్పించి వేరేవారిని నియమించడం ఎంతవరకు న్యాయమని ఫౌండర్ ట్రస్టీ వానపల్లి నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ధర్మకర్తను చైర్మన్ స్థానం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు ఆలయాల ట్రస్టుబోర్డుల నియామకాల్లో కనిపించడం శోచనీయమన్నారు. స్థానిక విలేరులతో ఆయన గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి వానపల్లి సూర్యనారాయణ (తమ్మయ్య గురువు) ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి తామే వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. దేవాలయాల ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంలో రాజికీయాలను ప్రోత్సహించడం దేవదాయ శాఖ అధికారులకు తగదన్నారు. ట్రస్టు బోర్డు మెంబరు ఉన్నచోట ఆయనే చైర్మన్‌గా వ్యవహరిస్తారని గతంలో దేవదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు స్పష్టంచేశారు. దేవదాయశాఖ ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు సవరించకుంటే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ పి.శ్యామలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌గా వానపల్లి నర్సింగరావే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై గతంలో జీఓ కూడా ఇచ్చారన్నారు. ఆయన ఆధ్వర్యంలో బోర్డు మెంబర్లు ఉంటారని పేర్కొన్నారు.