సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన | - | Sakshi
Sakshi News home page

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన

Jul 28 2025 7:08 AM | Updated on Jul 28 2025 7:08 AM

సబ్జె

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన

అర్థం కాక తలులు పట్టుకుంటున్న విద్యార్థులు

బోధించలేమని చేతులెత్తేస్తున్న ఉపాధ్యాయులు

విద్యార్థుల జీవితాలతో కూటమి అటలు!

రామభద్రపురం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ యూపీ స్కూల్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు బదిలీలు చేపట్టిన ప్రభుత్వం యూపీ స్కూళ్లలో ఉన్న తెలుగు, హిందీ పండిట్‌లను ఎల్‌ఎఫ్‌ఎల్‌, ఎంపీఎస్‌ హెచ్‌ఎంలుగా బదిలీ చేసింది. యూపీ స్కూల్స్‌లో లాంగ్వేజ్‌ పండిట్‌లు లేకుండా చేసింది. పాఠశాలలో ఉన్న టీచర్లలో ఎవరో ఒకరు లాంగ్వేజ్‌లు బోధించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. అయితే టీచర్లు ఉపాధ్యాయ విద్య చదివినా లాంగ్వేజ్‌ బోధన నైపుణ్యాలపై వారికి అవగాహన ఉండడం లేదు.సోషల్‌ టీచర్‌ను హిందీ చెప్పమంటే ఏం చెప్పగలరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 158 యూపీ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించడంలో నిర్లక్ష్యం చూపడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుతో కొత్త పిల్లలను జాయిన్‌ చేయడం మాట దేవుడెరుగు ఉన్న పిల్లలను ఎలా కాపాడుకోవాలా? అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

చదివేదొకటి..చెప్పేదొకటి..

ప్రభుత్వం తీరు వల్ల బీఈడీలో చదివేదొకటి, పాఠశాలల్లో చెప్పేదొకటి అన్నచందంగా ఉందని టీచర్లు అంటున్నారు.యూపీ పాఠశాలల్లో లాంగ్వేజ్‌ పండిట్లను పీస్‌ హెచ్‌ఎంలుగా బదిలీ చేయడంతో సోషల్‌, బయాలజీ, గణితం సబ్జెక్టు చెబుతున్న టీచర్లు తెలుగు, హిందీ లాంగ్వేజ్‌లు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా చేస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడడం దేవుడెరుగు. అసలు సంబంధం లేని పాఠాలను ఎలా బోధిస్తారనే జ్ఞానం ఉండదా? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత మూలంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండంతో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామభద్ర పురం మండలంలోని కోటశిర్లాం యూపీ పాఠశాలలో 6,7,8 తరగతులలో 28 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే మొత్తం ఆరు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇందులో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాగ్వేజ్‌లు ఒక్క టీచరే బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో 8 మంది తమకు సరిపడా టీచర్లు లేరని, సరైన విద్యాబోధన అందడం లేదన్న ఉద్దేశంతో టీసీలు తీసుకుని వేరే పాఠశాలలకు వెళ్లియారు. మిగిలిన వారు కూడా ఇలాగే పరిస్థితి ఉంటే తాము కూడా ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లిపోతామంటున్నారు.

లాంగ్వేజ్‌ టీచర్ల కొరత వాస్తవమే..

యూపీ స్కూల్స్‌లో ఉన్న మిగులు ఉపాధ్యాయులను ఎల్‌ఎఫ్‌ఎల్‌, ఎంపీఎస్‌ హెచ్‌ఎంలుగా బదిలీచేశారు. దాంతో లాంగ్వేజ్‌ టీచర్ల కొరత ఉంది. ప్రస్తుత క్లస్టర్‌ స్కూల్స్‌లో ఉన్న ఎంటీఎస్‌లను వినియోగించుకోవాలి. డీఎస్సీ నియామకాలు చేపడితే కొత్త టీచర్లను నియమిస్తారు.

కె.మోహనరావు, డిప్యూటీ డీఈవో

సరిగ్గా అర్థం కావడం లేదు..

మా పాఠశాలలో తెలుగు, హిందీ లాంగ్వేజ్‌లను బయాలజీ, ఇంగ్లీషు టీచర్లు బోధిస్తున్నారు. మాకు సక్రమంగా అర్థం కావడం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందడం లేదు. ఇలా అయితే ప్రభుత్వ స్కూల్స్‌లో చదవలేం. తీరు మారకుంటే టీసీలు పట్టుకుని వేరే పాఠశాలకు వెళ్లిపోతాం.

బి.మేఘన, 8వ తరగతి,యూపీ స్కూల్‌, ఇట్లా మామిడిపల్లి

యూపీ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం..

యూపీ స్కూల్స్‌లలో తెలుగు, హిందీ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్య అందడంలేదు. లాంగ్వేజ్‌ల బోధన లేక 6,7,8 తరగతుల విద్యార్థులు చేరడం లేదు. ప్రభుత్వ విద్యాసంస్కరణలతో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా ఉంది. భవిష్యత్‌లో యూపీ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. జేసీ రాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన1
1/4

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన2
2/4

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన3
3/4

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన4
4/4

సబ్జెక్టు టీచర్లతో లాంగ్వేజీల బోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement