
పరిశ్రమల దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తులను సింగల్ డెస్క్ పాలసీ కింద 21 రోజుల్లో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మే నుంచి జూలై వరకు 1652 దరఖాస్తులు అందగా 1634 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని, మిగిలిన వాటిలో 11 దరఖాస్తులు కాలుష్య నియంత్రణ మండలి వద్ద, మిగిలినవి ఫైర్, గ్రౌండ్ వాటర్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజి శాఖల వద్ద పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని గడువు లోగా పరిష్కరించాలని, తిరస్కరిస్తే తగిన కారణాలతో తిరస్కరించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఎల్‌డీఎం రమణమూర్తి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ లక్ష్మణ రావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా ఫైర్ ఆఫీసర్ రామ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, ఫ్యాక్టరీస్, స్కిల్ డెవలప్‌మెంట్, శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.