
ఆందోళనకు దిగకముందే.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన దిశగా వెళ్లక ముందే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక రెవెన్యూ హోమ్‌లో మంగళవారం ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన జరిగిన ఏపీజేఏసీ అమరావతి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. డిమాండ్ల సాధనకు ఉద్యమాలు తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 16 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మరోవైపు ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపులపై కనీసం ఏ స్థాయిలోనూ చర్చలు జరపడం లేదని ఆరోపించారు. దాచుకున్న బకాయి సొమ్ము ఎంతెంత ఉందో ఆయా ఉద్యోగి, ఉపాధ్యాయునికి వివరంగా తెలియజేసే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటీవల అన్ని ఉమ్మడి జిల్లాలో పర్యటించామని, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసు కున్నామని, వచ్చేనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి సభలో సమీక్షించి డిమాండ్‌ల అజెండాను తయారుచేస్తామన్నారు. అనంతరం జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ కార్య వర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి వైస్ చైర్మన్ డాక్టర్ డి.జైధీర్, ఏపీ విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ లేబర్ శాఖ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ప్రభాకర్, ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రాజేష్, జిల్లా అధ్యక్షుడు తాడ్డి గోవింద, ప్రధాన కార్యదర్శి సూర్య, ఏపీజేఏసీ జిల్లా కమిటీకి చెందిన వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తహసీల్దార్లు, డివిజన్, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వానికి ఏపీ రెవెన్యూ
సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు హెచ్చరిక
వచ్చేనెల 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర సభలను విజయవంతం చేయాలి