
సంపన్నులను వదిలి.. చిరుద్యోగుల వెంట!
సాక్షి, పార్వతీపురం మన్యం/ విజయనగరం అర్బన్:
సంపద సృష్టిస్తామని, పేదరికాన్ని రూపుమాపుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘సామాజిక బాధ్యత’ అంటూ సంపన్నుల వెంటపడుతున్నారు. బంగారు కుటుంబాలను తీర్చిదిద్దాలని.. ఆ మేరకు పేద వర్గాలను దత్తత తీసుకోవాలని ప్రాథేయపడుతున్నారు. ఆ పిలుపునకు సంపన్న వర్గాలెవరూ ముందుకు రావడం లేదు. స్వయంగా ఆ పార్టీ నాయకులే స్పందించడం లేదు. జిల్లాకు చెందిన మంత్రి సంధ్యారాణి.. అప్పుడెప్పుడో పది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ప్రకటించగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 264 కుటుంబాలను దత్తతతీసుకుంటామని ప్రకటనలో తెలిపారంతే!. ఆ తర్వాత ఏ ప్రజాప్రతినిధి నుంచి గానీ.. ఉన్నతాధికారి నోటి వెంట గానీ దత్తత మాట రాలేదు. ప్రభుత్వం నుంచి నిర్దేశించిన ఆగస్టు గడువు సమీపిస్తుండటంతో కిందిస్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అంతా కలసి పడ్డారు. రెండేసి కుటుంబాలను దత్తత తీసుకోవాలని వెంటపడుతున్నారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల జీతంపై ఆధారపడే ఉపాధ్యాయులపై రెండు కుటుంబాల దత్తత భారం మోపడం భావ్యమా? అని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వాలని చూడటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్‌షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. ఇప్పుడు ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు జిల్లా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో అధికారుల మీద పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ చేస్తున్నా.. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 విధానం.. ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది.
ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల కోసం ఎదురుచూస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 33,309 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉండగా.. ఇప్పటికి సుమారుగా 13 వేల కుటుంబాలే మ్యాపింగ్ అయ్యాయి. ఇంకా 20 వేల కుటుంబాల వరకు మార్గదర్శులను అనుసంధానం చేయాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో 60,067 బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు.
అధికారులు, ఉద్యోగుల మెడపై కత్తి..
బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. పారిశ్రామిక సంస్థలు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్‌్ .. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయి లో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. మరోవైపు తమ పాఠశాలల్లో పని చేస్తున్న కింది స్థాయి సిబ్బందితో పాటు, విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని విభాగాల్లో ఉద్యోగుల నెత్తినా రుద్దుతున్నారు. దీంతో ఆయా వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
మార్గదర్శకులు ఏరీ..?
బలవంతపు దాతృత్వమా?
దాతృత్వం బలవంతం కాదు.. హృదయం నుంచి రావాలి. ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితిని గమనించకుండా, వారిపై సామాజిక ఒత్తిడి పెంచేలా చర్యలు చేపట్టడం న్యాయసమ్మతమైనది కాదు. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి చెందిన వేతన జీవులు. గృహ నిర్మాణ రుణాలు, పిల్లల చదువులు, ఖర్చులు, కుటుంబ సభ్యుల అనారోగ్య బాధ్యతలు, వివాహాలు వంటివన్నీ ఆ జీతం నుంచే భరించాలి. పీ–4 భారంతో బోధనకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
– నల్లా బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
ముందుకు రాని
‘శ్రీమంతులు’
అధికారులకు
గుదిబండగా పీ–4
దత్తత తీసుకోవాలని ఉద్యోగులపై ఒత్తిడి
వేతన జీవులకు ఎలా సాధ్యమంటున్న
ఉపాధ్యాయ
సంఘాలు
ఒక ఉపాధ్యాయుడికి సాధ్యమయ్యేనా..
పీ–4 విధానం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలను బంగారు కుటంబాలుగా మార్చాలని నిర్ణయించడం ముదావహం. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, పెద్ద అధికారులు, సంపన్న వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేసి దత్తత తీసుకోవాలని చెబితే బాగుంటుంది. నెల జీతంపై ఆధారపడే ఉపాధ్యాయుడు ఏ విధంగా రెండు కుటుంబాలను దత్తత తీసుకోగలడు?
– అమరపు సూర్యనారాయణ,
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
కార్పొరేట్లను వదిలి టీచర్లపై ఒత్తిడా?
పీ–4 పథకం ద్వారా పేదవర్గాలను ధనిక వర్గాలు తీసుకోవాలి. ప్రభుత్వం కార్పొరేట్ వారిని విడిచిపెట్టి ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం తగదు. ప్రస్తుతం ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి టీచర్లనే ప్రభుత్వం దత్తత తీసుకుని ఆదుకోవాలి. పీ–4 పథకం దత్తత కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం.
– ఎస్.మురళీమోహన్,
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

సంపన్నులను వదిలి.. చిరుద్యోగుల వెంట!

సంపన్నులను వదిలి.. చిరుద్యోగుల వెంట!

సంపన్నులను వదిలి.. చిరుద్యోగుల వెంట!

సంపన్నులను వదిలి.. చిరుద్యోగుల వెంట!