
వైద్యుల పనితీరుపై విచారణ
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మెడికల్ అంకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ పి.విజయలక్ష్మిపై ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టింది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ సమయంలో విజయలక్ష్మి అందుబాటులో లేకుండా వేరేచోట ప్రాక్టీస్ చేస్తున్నారంటూ పాండ్రంకి వెంకటరమణ అనే వ్యక్తి ఆధారాలతో ఫిర్యాదుచేశారు. అలాగే, రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శివశ్రీధర్‌పై కూడా అదే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయన పనితీరుపై వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల విచారణ జరిపారు.
డీఎస్‌డీఓ బాధ్యతల స్వీకరణ
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాల క్రీడాభివృద్ధి అధికారిగా కె.శ్రీధరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ డీఎస్‌డీఓగా ఉన్న వెంకటేశ్వరరావు విశాఖపట్నం బదిలీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధరరావుకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్‌లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అంధుల పాఠశాల సందర్శన
విజయనగరం అర్బన్: పట్టణంలోని పూల్‌బాగ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.రవిప్రకాష్ రెడ్డి మంగళవారం సందర్శించారు. పాఠశాల ఆవరణ, గదులు, ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఆ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఆశయ్య, పాఠశాల ప్రధానాచార్యులు ఎం.మహేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రాణం తీసిన భూ వివాదం
● నాటు తుపాకీతో వ్యక్తి హత్య
శృంగవరపుకోట: రెండు కుటుంబాల మధ్య భూ వివాదం హత్యకు దారితీసింది. సొంత పినతండ్రిని నాటుతుపాకీతో హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన పల్లపుదుంగాడలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ చిట్టంపాడు గ్రామానికి చెందిన సీదర రాము కొద్ది నెలలుగా పల్లపుదుంగాడ గ్రామంలో ఉన్న కుమార్తె బడ్నాయిన నాగమణి వద్ద ఉంటున్నాడు. సీదర రాము(60), తన అన్న కొడుకు సీదర నాగులు మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం సాగుతోంది. ఇదే విషయమై సోమవారం రాత్రి వాగ్వాదం జరగడంతో సీదరి నాగులు తన పినతండ్రి రాముపై నాటుతుపాకీతో కాల్పులు జరిపి హతమార్చాడు. అనంతరం పరారయ్యాడు. విషయం మంగళవారం ఉదయం తెలియడంతో ఎస్.కోట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుమార్తె నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

వైద్యుల పనితీరుపై విచారణ

వైద్యుల పనితీరుపై విచారణ