
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమైంది. ఈ మేరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోటీల్లో నలుగురు క్రీడాకారులు అంతర్ జిల్లాల పోటీలకు అర్హత సాధించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 78 మంది క్రీడాకారులు పాల్గొనగా..జిల్లా జట్టులో స్థానం దక్కించుకునేందుకు క్రీడాకారులు పోటీపడ్డారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో బాలుర విభాగంలో కాండ్రేగుల సోమనాధ్, వీర్రాజు వర్మలు ఉండగా..బాలికల విభాగంలో బోరా ప్రవల్లిక, సాయి జాహ్నవిశ్రీ ఉన్నారు. అదేవిధంగా బత్తుల జస్మిక, ఇషిక వర్మ తదితరులు కన్సొలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో కాకినాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్‌కు పంపించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ జ్వాలాముఖి తెలిపారు. ఈ పోటీలను సీనియర్ నేషనల్ ఆర్బిటర్ రానా, అర్చన, పద్మావతిలు పర్యవేక్షించారు.