
జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
పార్వతీపురం రూరల్/ మక్కువ: జంట హత్యల నేరం కేసులో ముద్దాయి గిన్నిపల్లి సింహాద్రికి పా ర్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎస్.దా మోదరరావు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1000లు జరిమానా విధించినట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని మక్కువ పోలీస్‌స్టేషన్‌లో 2018లో నమోదైన జంట హత్యల కేసులో పలికివలస గ్రామానికి చెందిన ఒమ్మి పైడిరాజు ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన గిన్నిపల్లి సింహాద్రి ముద్దాయిగా రుజువైందన్నారు. భూ వివాదంలో భాగంగా పైడిరాజు తల్లిదండ్రులు పొలంలో మేకలు మేపుతున్న సమయంలో సింహాద్రి హత్య చేయడంతో మృతుల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో రెండవ అదనపు జిల్లా జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు సిబ్బందికి ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.