
అర్జీల పరిష్కారానికి ప్రాముఖ్యం ఇవ్వాలి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్స్ మరళి, వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారు సంతృప్తిచెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 44 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి 44 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్‌తో పాటు ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులను స్వీకరించారు, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీల పరిష్కారానికి ప్రాముఖ్యం ఇవ్వాలి