
11 మంది మందుబాబులపై కేసులు
విజయనగరం క్రైమ్ : జిల్లా వ్యాప్తంగా బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారమే జామి పోలీస్ స్టేషన్ పరిధి అలమండలో పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేయగా ఈ ఆదివారం పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధి సంత శివార్లలో బహిరంగ మద్యపానం చేస్తున్న 11మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారని ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. వారం వారం జరుగుతున్న సంతలలో మందుబాబుల ఆగడాలను అరికట్టేందుకే డ్రోన్స్ ను ఆయా సంతలలో వినియోగిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆకస్మికంగా డ్రోన్స్ తో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద మానాపురం ఎస్సై ఆర్.జయంతి ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారని ఎస్పీ తెలిపారు. దాడుల్లో పెద మానాపురం ఎస్‌ఐ తో పాటు డ్రోన్ పైలట్ వెంకటేష్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో
పందాల రాయుళ్లు
● రెండు పొట్టేళ్లు స్వాధీనం
గరుగుబిల్లి: పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న పందెం రాయుళ్లను అదుపులోకి తీసకుని రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం. రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని రావివలస గ్రామ పరిసరాల్లో పందానికి సిద్ధం చేసిన రెండు పొట్టేళ్లను, నలుగురు పందెం రాయుళ్లతోపాటు రూ. 620 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పందెం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా జూదం గాని, పొట్టేళ్లు, కోళ్ల పందాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. దాడుల్లో సిబ్బంది ఉమా మహేశ్వరరావు, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులకు గాయాలు
రేగిడి: మండల పరిధిలోని అప్పాపురం గ్రామ సమీపంలో ఆదివారం బైక్ అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. పాలకొండ మండలం మంగళాపురం గ్రామానికి చెందిన మడపాల సాయి, సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కె.యోగేష్‌లు కె.వెంకటాపురంలోని తమ మిత్రుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా అప్పాపురం సమీపంలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వాహనంతో వచ్చిన 108 ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గర్భాపు నారాయణరావులు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. బాధితుల కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో మెరుగైన వైద్యంకోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

11 మంది మందుబాబులపై కేసులు

11 మంది మందుబాబులపై కేసులు