
చోరీ చేసిన బైక్‌లపై తిరుగుతూ..
● పోలీసులకు చిక్కిన కేటుగాడు
● ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
భోగాపురం: నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ద్విచక్ర వాహనాలే ఆ కేటుగాడి టార్గెట్.. ఏ బండైనా సరే కనురెప్ప పాటులో చోరీ చేయగలిగే టాలెంట్ వాడి సొంతం.. బైక్ నచ్చితే చాలు అది మాయమైనట్లే...ఏడాది కాలంగా దొంగతనాలు చేయడం..ఎంచక్కా దొంగలించిన బైకులపైనే చక్కెర్లు కొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు.. చివరకు పోలీసుల నిఘా నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.. దొంగలించిన ద్విచక్ర వాహనంపైనే భోగాపురం రోడ్లపై తిరుగుతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన రాపేటి సూర్యప్రకాష్ గతేడాది పోలిపల్లిలో ద్విచక్రవాహనం దొంగలించాడు. శనివారం అదే బైక్‌పై భోగాపురంలో తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి నంబర్‌ను తనిఖీ చేయగా దొంగలించిన బండిగా గుర్తించారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా ఏడాది కాలంలో చేసిన చోరీ వివరాలను చెప్పాడు. పోలిపల్లిలో–1, పూసపాటిరేగలో–1, బొండపల్లిలో–1, పద్మనాభంలో–2 చొప్పున ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ దుర్గాప్రసాద్, ఎస్సైలు పాపారావు, సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.