
చికిత్స పొందుతూ హెచ్‌సీ మృతి
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్, ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు(49) సోమవారం మరణించారు. గత నెల 23న చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్ మెయిన్ గేట్ సమీపంలో విజయనగరం–విశాఖ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్‌సీ రామునాయుడు తీవ్ర గాయపడ్డారు. గాయపడిన ఆయనను విశాఖలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. రామునాయుడు మృతదేహాన్ని విజయనగరంలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. పోస్టుమార్టం అనంతరం రామునాయుడు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలంలోని కోరాడ గ్రామానికి తరలించారు. రామునాయుడు మరణించడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. మృతుడు హెచ్‌సీకి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సూర్యకాంతం డెంకాడ మండలంలోని మోపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దకుమార్తె మౌనిషసాయి ఎంబీబీఎస్ చదువుతుండగా చిన్నపాప దాషిని ఇంటర్ పూర్తి చేసింది. కోరాడ రామునాయుడు మరణవార్త బెటాలియన్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రగాఢ సంతాపం
మరణించిన హెచ్‌సీ కోరాడ రామునాయుడు కుటుంబానికి పలువురు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌సీ కోరాడ రామునాయుడు మృతదేహాన్ని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సందర్శించి నివాళి అర్పించారు. బెటాలియన్ అదనపు కమాండెంట్ సి.రాజారెడ్డి, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, బెటాలియన్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.అప్పలనాయుడు, డెంకాడ, పద్మనాభం మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.