
మృత్యుంజయుడు పింటూ
● ఏనుగుల దాడి నుంచి క్షేమంగా
బయటకు
భామిని: ఏనుగుల ఘీంకారంతో దిక్కులు పిక్కటిల్లుతున్న సాయం సంధ్యా సమయం, మరో వైపు భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన పింటూ ఏనుగులకు చిక్కాడన్న ప్రచారంతో ప్రజల పరుగులు..ప్రమాద స్థలానికి వెళ్లడానికి ప్రజలకు ధైర్యం చాలడం లేదు. ఏనుగులు కనిపిస్తూనే ఉన్నాయి. ఏనుగులకు అరటిగెల ఇవ్వడానికి వెళ్లిన పింటూ సాంత్రో వాటికి దొరికి పోయాడనే ప్రచారం ఊపందుకుంది. మరో పక్క సింగిడి, బిల్లుమడ, నులకజోడు గ్రామస్తులతో రోడ్డంతా నిండిపోయింది. చివరికి సోమవారం సాయంత్రం పింటూ బయటపడడంతో ప్రజల్లో ఆందోళన తగ్గింది. మృత్యుంజయుడిగా పింటూ సాంత్రో బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల దాడిలో పింటూ చిక్కుకుని తప్పించుకునే క్రమంలో బురదలో పడిపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ అటవీ సిబ్బందితో కలిసి పింటూ సాంత్రోను ప్రజల ముందుపెట్టి వెల్లడించి సింగిడి గ్రామస్తులకు అప్పగించారు.