
వేతనాలు ఇవ్వండి మహాప్రభో!
రామభద్రపురం: పని చేసినా పస్తులే.. అనేలా ఉపాధి హామీ పథకం వేతనదారుల పరిస్థితి తయారైంది. గత 10 వారాలుగా పనులకు వెళ్తున్నా వేతనాలు మాత్రం చెల్లించడం లేదని రామభద్రపురానికి చెందిన వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజువారీ కూలి డబ్బులపై ఆధారపడే కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నామని పేర్కొంటున్నారు. నచ్చిన కూర వండుకుని ఇష్టంగా తిని చాలా రోజులైందని వాపోయారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నా.. మరోవైపు కడుపు మాడిపోతున్నా కష్టపడి పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి తాము చూడలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలా నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ వేతనాలు అందివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.