
నిలిచిన బలసలరేవు వంతెన.. తొలగని చింత
● మాట ఇచ్చి మరచిపోయిన పవన్‌కళ్యాణ్
● గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెనకోసం పోరాడిన ప్రజలు
● వారికి సంఘీభావంగా పోరాటంలో పాల్గొన్న జనసేనాని
● ప్రజల పోరాటాన్ని గుర్తించి వంతెన
మంజూరుచేసిన జగన్‌మోహన్‌రెడ్డి
● రూ.87 కోట్ల కేటాయింపు
● కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదలని పనులు
రాజాం: సంతకవిటి మండలం వాల్తేరు గ్రామ సమీపంలో నాగావళి నదిపై బలసలరేవు వద్ద వంతెన నిర్మితమైతే వేలాది మంది రాకపోకలకు అనువుగా ఉంటుంది. శ్రీకాకుళానికి దారి దగ్గరవుతుంది. వంతెన నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. చివరకు గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వంతెన మంజూరు చేసింది. బలసలరేవు నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఇసుకలపేట వరకు వంతెన పనులకు శ్రీకారం చుట్టింది. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూ.87 కోట్ల కేటాయించింది. పనులు ప్రారంభించి వేగవంతం చేయించింది. నదిలో పిల్లర్ల నిర్మాణం మూడోవంతు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడంతో వంతెన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయా యి. ఇంతవరకూ వంతెన పనుల గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వంతెన కోసం మాట్లాడకపోవడంపై జనం మండిపడుతున్నారు. వంతెన పోరాట కమిటీ ఏర్పాటుచేసిన నిరవధిక దీక్షలో భాగంగా 2019 అక్టోబర్ 20న వాల్తేరుకు వచ్చి దీక్షలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్ ఇప్పుడు కినుక వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, అప్పటి సీఎం చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిన జనసేనాని ఇప్పుడు అదే నాయకుడి చేతిలో కీలుబొమ్మ అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడగకుండానే వంతెన మంజూరుచేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బలసలరేవు వద్ద వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ పలు సర్వేలు నిర్వహించింది. అవసరమైన నిధులను అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాంతో అప్పటి ఎమ్మెల్యే కంబాల జోగులు సాధించుకున్నారు. సంతకవిటి నుంచి ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాలకు రహదారి సౌకర్యం కలిగించడంతో పాటు రెండు జిల్లాలను కలిపేవారధిలా మార్చారు. 560 మీటర్లు పొడవున 16 పిల్లర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. రెండు వైపులా వంతెన అప్రోచ్ నిర్మాణం కోసం 14 ఎకరాల భూమిని రైతుల వద్ద సేకరించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వాల్తేరు, పనసపేట, గారన్నాయుడపేట, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, జీఎన్‌పురం, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, మంతిన, మల్లయ్యపేట, రామారాయపురం, మల్లయ్యపేట, చింతలపేట, మందరాడ, మండాకురిటి తదితర గ్రామాలతో పాటు ఆమదాలవలసలో పలు మండలాలుకు రహదారి సౌలభ్యం కలుగుతుంది.
పనులు జరుగడం లేదు
వాల్తేరు వద్ద నాగావళి నది గుండా వందలాది మంది ప్రతిరోజు రాకపోకలు సాగిస్తారు. వర్షాకాలంలో నాటు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే కంబాల జోగులు కృషితో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంతెన నిర్మాణానికి రూ. 87 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వంతెన పనులను పట్టించుకోకపోవడం విచారకరం. – గురుగుబెల్లి స్వామినాయుడు, వైఎస్సార్‌సీపీ సంతకవిటి మండలాధ్యక్షుడు, వాల్తేరు

నిలిచిన బలసలరేవు వంతెన.. తొలగని చింత