క్షయ రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు
● జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి
విజయనగరం ఫోర్ట్: క్షయ రోగుల కుటుంబసభ్యులకు క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి తె లిపారు. ఈ మేరకు స్థానిక అరుంధతి నగర్‌లో ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ రోగుల కుటుంబసభ్యులకు చేస్తున్న స్కిన్ (సీ వై–టీబీ) టెస్టును గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ రోగుల కుటుంబసభ్యులకు స్కిన్ టెస్టు చేయనున్నామని చెప్పారు. 48 నుంచి 72 గంటల్లో ఈ పరీక్ష రిజల్ట్ వస్తుందన్నారు. ఈ పరీక్షలో 5ఎంఎంగా నిర్ధారించిన ఎడల టీబీ ప్రివెంటివ్ థెరపీ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు అర్చన దేవి, అశోక్ పాల్గొన్నారు.
ఒకే ఈతలో రెండు ఆవుదూడలు
గజపతినగరం: మండల కేంద్రంలోని ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ పీవీవీ గోపాల రాజు జెర్సీ ఆవు ఒకే ఈతలో రెండు జెర్సీ ఆడపెయ్యలకు జన్మనిచ్చింది. ఈ విధంగా కవలలు పుట్టడం చాలా అరుదని స్థానిక పశువైద్య శాఖ ఎ.డి చంద్రశేఖర్ అన్నారు. గురువారం పీవీవీ గోపాల రాజుకు చెందిన ఆవు, దానికి పుట్టిన రెండు ఆడపెయ్యలు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించానని ఎ.డి చంద్రశేఖర్ తెలిపారు. ఒకే ఈతలో జన్మించిన ఆవుపెయ్యిలను పలువురు ఆసక్తిగా తిలకించారు.
రూ.కోటి 72 లక్షల విలువైన సిగరెట్లు సీజ్
● శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల విజిలెన్స్ ఎస్పీ
విజయనగరం క్రైమ్: ఎలాంటి ట్యాక్స్‌లు చెల్లించకుండా ఒడిశా నుంచి ఏపీలోకి వచ్చిన రూ.కోటి 72 లక్షల విలువ గల సిగరెట్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజయనగరంలోని ఎంవీఆర్‌జీఆర్ కాలేజ్ సమీపంలో గల సూర్య లేఅవుట్‌లో సుంకర పేట వద్ద ఓ గోడౌన్‌లో సిగరెట్లు డంప్ చేస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యాన్‌లో అగ్గిపెట్టెలు బిల్లులతో రవాణా చేస్తున్నట్లు తొలుత తమకు సమాచారం అందిందన్నారు. అయితే మ్యాచ్‌బాక్స్ బిల్లు పేరుతో 3 లక్షల 16 వేల సిగరెట్ బాక్స్‌లు సరఫరా చేస్తున్నారని, తర్వాత అందిన సమాచారంతో సూర్య లే అవుట్ వద్ద ఉన్న ఓ గొడౌన్‌లో దాడిచేసి వ్యాన్‌లో ఉన్న సిగరెట్ల లోడును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
నిరాదరణకు గురైన బాలికకు సంరక్షణ
గుమ్మలక్ష్మీపురం: కురుపాం మండల కేంద్రంలోని శివన్నపేట గ్రామంలో నిరాదరణకు గురైన 11 ఏళ్ల బాలికను మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ చొరవతో..మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.కనకదుర్గ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు బాలబాలికల వసతి గృహానికి గురువారం తరలించారు. తల్లిదండ్రులు వదిలేసిన ఓ బాలిక శివన్నపేటలో తిరుగుతూ ఎవరైనా తినడానికి ఇస్తే తింటూ..రోజుకో ఇంటి గడపలో తలదాచుకుంటోందన్న సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ దేవ్ బాలిక సంరక్షణ నిమిత్తం ఐసీడీఎస్ పీడీ కనకదుర్గకు తెలియజేశారు. దీనిపై స్పందించిన పీడీ ఆ బాలికను బాలబాలికల వసతి గృహంలో చేర్పించాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణకు ఆదేశించగా..ఆయనతో పాటు జిల్లా లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్ బాలికతో మాట్లాడి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి సూచనల మేరకు వసతి గృహంలో చేర్పించారు. కార్యక్రమంలో కురుపాం మహిళా సంరక్షణ అధికారి రోజారాణి, ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు.
క్షయ రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు
క్షయ రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు
క్షయ రోగుల కుటుంబ సభ్యులకు పరీక్షలు


