సైబర్ మోసగాడు అరెస్ట్ ?
● అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
● నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థిగా గుర్తింపు
వీరఘట్టం: హోలో .. నేను వీరఘట్టం పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను.. ఎస్సై గారు ఆస్పత్రిలో ఉన్నారు.. అర్జెంట్‌గా రూ.55 వేలు ఫోన్ పే ద్వారా కావాలని నమ్మబలికి 75693 41175 నంబర్ నుంచి ఫోన్ చేసి వీరఘట్టంనకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి నుంచి నిందితుడు రూ.28 వేలు కాజేశాడు. ఈ వ్యవహారంపై ఈనెల 2న సాక్షిలో ‘కానిస్టేబుల్‌నని చెప్పి సైబర్ మోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై వీరఘట్టం పోలీసులు స్పీడ్‌గా స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బాధితుడికి వచ్చిన 75693 41175 ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ నేరగాడి ఆచూకీ గుర్తించారు. ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా నిందితుడు కృష్ణా జిల్లా బాపట్లలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఐదు రోజుల కిందట బాపట్లకు పయనమయ్యారు. ఎస్సై జి. కళాధర్ వీరఘట్టం నుంచి నిందితుడి ఫోన్‌ను ట్రాక్ చేస్తూ హెచ్‌సీ, కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో బాపట్లలో నిందితుడ్ని పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. సైబర్ నేరానికి పాల్పడిన వ్యక్తి బీటెక్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. ఈ సైబర్ నేరం వెనుక ఉన్న కుట్రదారులందరినీ పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిందితుడ్ని సోమవారానికి వీరఘట్టంనకు తీసుకువస్తారని సమాచారం.
వాట్సాప్ గ్రూప్‌పై అనుమానాలెన్నో....
‘వి.జి.టి.యం నీడ్ మనీ ట్రాన్స్‌ఫర్స్ వీరఘట్టం’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఈ సైబర్ నేరానికి బీజం పడడంతో పోలీసులు ఈ గ్రూప్ అడ్మిన్‌తో పాటు పెద్ద ఎత్తున మనీ ట్రాన్స్‌ఫర్స్ చేస్తున్న వారిపై నిఘా వేశారు. ఈ గ్రూప్‌లో ఎవరికై నా డబ్బులు కావాలన్నా, ఫోన్ పే కావాలన్నా గ్రూప్‌లో ఉండే సభ్యులు గతంలో పెట్టిన మెసేజ్‌లు.. ఇంత వరకు జరిగిన అన్ని మనీ ట్రాన్స్‌ఫర్స్‌పై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాడు నోరు విప్పితే అసలు దొంగలు ఎవరనేది తేలుతుంది.


