మహారాణిపేట: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 2న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు కోసం గుర్తించిన ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రాంగణాలకు డిసెంబర్ 1, 2 తేదీల్లో సెలవు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేదా ఓటు వేసేందుకు మూడు గంటల వెసులుబాటు కల్పించాలని సూచించారు. పోలింగ్ ముగిసే సమయం నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు సంబంధిత ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖలు సహకరించాలని కలెక్టర్ కోరారు.


