ఉపసంహరణ పత్రం రశీదు ప్రత్యర్థి అభ్యర్థి బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపణ రిటర్నింగ్ అధికారి తీరుపై అనుమానాలు కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి ఫిర్యాదు
మహారాణిపేట: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ సర్పంచ్ నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఉపసంహరణ పత్రాన్ని ప్రత్యర్థి అభ్యర్థి బలవంతంగా లాక్కెళ్లినా రిటర్నింగ్ అధికారి అడ్డుకోలేదని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, సర్పంచ్ అభ్యర్థి బోయి వెంకటరమణ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, డీఆర్‌వో ఎస్‌డీ అనితకు శనివారం ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఎన్నికల రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న బోయి వెంకటరమణ పేరుతో, 23న వెంకటరమణ బోయి పేరుతో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశానని తెలిపారు. 24న జరిగిన పరిశీలనలో రెండూ ఆమోదం పొందాయన్నారు. అయితే, ఒక నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని రిటర్నింగ్ అధికారి నరసింహరావు సూచించడంతో నవంబర్ 27న వెంకటరమణ బోయి పేరుతో దాఖలు చేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు వివరించారు. ఉపసంహరణ పత్రంపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన సుమారు రెండు గంటల తర్వాత వీఆర్‌వో ప్రసాద్ ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని కోరినట్లు చెప్పారు. అక్కడికి వెళ్లినప్పుడు రిటర్నింగ్ అధికారి తన ఉపసంహరణ పత్రం రశీదు జేబులో పెట్టుకున్నారని, అదే సమయంలో ప్రత్యర్థి అభ్యర్థి వానపల్లి ముత్యాలరావు ఆ రశీదు బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారని ఆరోపించారు. అధికారి వద్ద ఉన్న కీలక ఎన్నికల పత్రాన్ని ప్రత్యర్థి అభ్యర్థి తీసుకెళ్తున్నా అడ్డుకోకపోవడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అధికారిక రికార్డుల్లో భద్రపరచాల్సిన పత్రాన్ని రిటర్నింగ్ అధికారి తన జేబులో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు ప్రత్యర్థి అభ్యర్థి వానపల్లి ముత్యాలరావు కూడా రెండు పేర్లతో నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, ఆయన విషయంలో అధికారులు భిన్నంగా వ్యవహరించారని వెంకటరమణ ఆరోపించారు. ఒక నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని తొలుత సూచించి, ఆ తర్వాత ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడి అవసరం లేదని చెప్పినట్లు తనకు తెలిసిందన్నారు. ఇద్దరు అభ్యర్థుల పట్ల వేర్వేరు వైఖరి అవలంబించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలించాలని కలెక్టర్‌ను కోరినట్లు వెంకటరమణ తెలిపారు.


