బీచ్‌రోడ్డులో స్టాళ్ల వివాదం | - | Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్డులో స్టాళ్ల వివాదం

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

● ఆందోళన వ్యక్తం చేస్తున్న చిల్లర వర్తకులు

ఏయూక్యాంపస్‌: సాగర తీరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న దుకాణాల వ్యవహారం వివాదంగా మారుతోంది. ఇటీవల బీచ్‌రోడ్డులో యోగా విలేజ్‌ నుంచి పోలీస్‌ మెస్‌ వరకు పదుల సంఖ్యలో కొత్త స్టాల్స్‌ ఏర్పాటు కావడంతో చిరు వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాయంత్రం వేళల్లో వీటి కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దశాబ్దాలుగా ఇసుక తిన్నెలు, ఫుట్‌పాత్‌లపై చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టాల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇదే వృత్తిని ఆధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని, అనుమతులు లేకుండా కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల తమ ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌రోడ్డులో చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక యూనియన్‌ ఉందని, అందులో సభ్యులుగా ఉన్నవారికే వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండాలని వారు కోరుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన వ్యాపారులు తమకు యూనియన్‌తో సంబంధం లేదని చెప్పడంతో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా రెండు రోజులుగా యూనియన్‌ సభ్యులు కొత్తగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ నిర్వాహకులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా దుకాణాలను తొలగించాలని కోరారు. దీనికి అవతలి వర్గం నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే యూనియన్‌ ప్రతినిధులు జీవీఎంసీ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పోలీసులు ఇరువర్గాలను పిలిచి సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన స్టాల్స్‌ కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరగడంతో ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిణామాలు తమ ఉపాధిపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం రాత్రి వంద మందికిపైగా చిరు వ్యాపారులు సమావేశమయ్యారు. ఆదివారం నుంచి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement