అలరించిన ‘పాతాళభైరవి’ | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘పాతాళభైరవి’

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

మద్దిలపాలెం: సురభి నాటకోత్సవాల్లో ప్రదర్శించిన పాతాళభైరవి ఆహుతులను కట్టపడేసింది. కళాభారతి వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో రెండో రోజు బుధవారం పాతాళభైరవి నాటకం ప్రదర్శించారు. కళాభారతి అధ్యక్షుడు ఎమ్మెస్‌ఎన్‌ రాజు, కార్యదర్శి రాంబాబు, నగర మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి నాటకంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రంగస్థలం నటి శివజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో కళా పోషకులు మేడా మస్తాన్‌ రెడ్డి, భీశెట్టి వెంకటేశ్వరరావు, పోతన రెడ్డి, అక్కు నాయుడు, తిలక్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌.భానుప్రసాద్‌ సంధానకర్తగా వ్యవహరించారు.

చురుగ్గా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ

మహారాణిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, వాటి డిజిటైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,23,009 మంది ఓటర్లకు సంబంధించి ఇప్పటివరకు 2,46,018 ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 12.16 శాతంగా నమోదైందన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, విశాఖ తూర్పు నియోజకవర్గం 16.59 శాతం ఫారాల పంపిణీతో తొలి స్థానంలో ఉండగా, విశాఖ పశ్చిమ నియోజకవర్గం 15.96 శాతంతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో కేవలం 6.78 శాతం మాత్రమే నమోదైనందున అక్కడ పంపిణీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 983 ఎన్యుమరేషన్‌ ఫారాలు డిజిటైజ్‌ అయినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఫారాలను సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి డిజిటైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement