మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ముడసర్లోవలోని ఈస్ట్ పాయింట్ కాలనీలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న యోగా వేడుకలను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా థీమ్‌కు అనుగుణంగా కార్యక్రమ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, పాల్గొనే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. యోగా కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకుని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్వో గోవింద్, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


