విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు విద్యార్థులంతా సులభంగా, నిర్ణీత సమయానికి చేరుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ భరత్‌ గుప్తాతో కలిసి శుక్రవారం ఏయూ సమీపంలోని ఎస్‌బీఐ కోదండరామ మీటింగ్‌ హాలులో శతాబ్ది వేడుకల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల రవాణా, పార్కింగ్‌ సదుపాయం, బస్సుల రూట్‌ మ్యాప్‌, ప్రవేశ పాసుల జారీ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏయూ వసతి గృహాల్లో ఉండేవారు, డే స్కాలర్లు, అనుబంధ కళాశాలల విద్యార్థులు వేదిక వద్దకు చేరుకోవడానికి అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బస్సులు ఎటువైపు నుంచి రావాలి, వాహనాలను ఎక్కడ పార్క్‌ చేయాలి, విద్యార్థులు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చోవాలి అనే విషయాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి పాసులు జారీ చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. వేడుకల నిర్వహణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏయూ అధికారులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమీక్షలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌ కుమార్‌, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఏయూ అధికారులు పాల్గొన్నారు.

ఏయూ శతాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై

కలెక్టర్‌ సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement