తాటిచెట్లపాలెం: తన సోదరిని వేధిస్తున్నాడనే కోపంతో ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తన అక్కతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని కిరాతకంగా చంపిన ఘటన ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి.. కంచరపాలెం ప్రాంతానికి చెందిన రాతు శ్రీను తన సోదరితో కలిసి నివసిస్తున్నాడు. శ్రీను సోదరికి గతంలోనే తుని ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్తతో మనస్పర్థలు కారణంగా విడిపోయింది. వారికి ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలో తుని ప్రాంతానికి చెందిన ప్రశాంత్(32)తో పరిచయం ఏర్పడింది. ఐదేళ్ల కిందట వీరు జీవనోపాధి కోసం విశాఖ వచ్చేశారు. ప్రశాంత్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ.. శ్రీను సోదరితో సహజీవనం చేస్తున్నాడు. అయితే, ప్రశాంత్ తరచూ మద్యం సేవించి తన సోదరిని వేధిస్తున్నాడని శ్రీను, అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని శ్రీను పథకం రచించాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మద్యం సేవించడానికి రావాలని ప్రశాంత్‌ను కై లాసపురం పాత పోస్టాఫీస్ ప్రాంతానికి శ్రీను పిలిచాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం, సమయం చూసి శ్రీను తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రశాంత్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న బండరాళ్లతో కొట్టి ప్రశాంత్‌ను హతమార్చాడు. అనంతరం నిందితుడు ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


