మరణంపై విజయం.. క్రీస్తు పునరుత్థానం | - | Sakshi
Sakshi News home page

మరణంపై విజయం.. క్రీస్తు పునరుత్థానం

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

డాబాగార్డెన్స్‌: ఈస్టర్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆదివారం ప్రార్థనలు జరిపారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని వాల్తేర్‌ సెమెట్రీలో తమ పూర్వీకుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులు వేకువ జామున 3 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధులను పూలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి తమ వారిని స్మరించుకుని, నివాళులర్పించారు. వివిధ సంఘాలకు చెందిన మత పెద్దలు, పాస్టర్లు, బిషప్స్‌ ఆత్మీయుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ కల్గించారు. వాల్తేర్‌ సెమెట్రీ అధ్యక్షుడు జార్జ్‌ చీడి, కార్యదర్శి మ్యాథ్యూ పీటర్‌, కోశాధికారి జార్జ్‌ పుల్లెట్‌ ప్రార్థనలతో ఉదయకాల ఆరాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తి గీతాలు మధురంగా ఆలపించారు.

చర్చిల్లో ఈస్టర్‌ వేడుకలు

నగర పరిధిలోని సెయింట్‌ ఆంథోనీ, ట్రినిటీ లూథరన్‌, లండన్‌ మిషన్‌, బాప్టిస్ట్‌, సెయింట్‌ అలోసిస్‌, సెయింట్‌ జాన్‌ ప్యారీస్‌, కల్వరి బాప్టిస్ట్‌ తదితర చర్చిలలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. చర్చి ఫాదర్లు ఈస్టర్‌ సందేశాన్నిచ్చారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.

బీచ్‌రోడ్డు: నగరంలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. గురజాడ కళాక్షేత్రంలో పీజే స్టీఫెన్‌పాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే విశ్వాసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్టీఫెన్‌పాల్‌, శైలపాల్‌ మాట్లాడుతూ ఈస్టర్‌ గొప్పతనాన్ని వివరించారు. క్రీస్తు పునరుత్థానం మానవాళికి ఆశ, విశ్వాసం, నూతన జీవితం ప్రసాదించిందన్నారు. ప్రేమ, క్షమ, త్యాగం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలనే సందేశాన్ని ఇచ్చారు. ద్వేషాలను దూరం చేసుకుని సోదరభావంతో జీవించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. భక్తిగీతాలు ఆలపిస్తూ విశ్వాసులు దేవుని స్తుతించారు. గీతాలు, నాటికల ద్వారా ఈస్టర్‌ సందేశాన్ని ప్రతిబింబించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement