వీసీ కుర్చీలో ఎంపీ దర్జా | - | Sakshi
Sakshi News home page

వీసీ కుర్చీలో ఎంపీ దర్జా

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

వర్సిటీ ప్రతిష్టను దిగజార్చిన

విశాఖ ఎంపీ శ్రీభరత్‌

ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

ఆ సమావేశంలో పక్కన్న కూర్చున్న వీసీ

గతంలోను స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ సీటులో

కూర్చున్న శ్రీభరత్‌

ఎంపీ తీరుపై మండిపడుతున్న ఏయూ వర్గాలు

ప్రొటోకాల్‌కు పాతర, ఏయూ ప్రతిష్టకు దెబ్బ

విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం మరోసారి వివాదాల కేంద్రమైంది. శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం సందర్భంగా గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి ఏకంగా వైస్‌ చాన్సలర్‌ సీటులో కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్‌ నియమించే అత్యున్నత పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని గాలికొదిలేసి, ఆ సీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వర్సిటీ ప్రతిష్టను మంటగలిపేలా విశాఖ ఎంపీ శ్రీభరత్‌ వ్యవహరించిన తీరు ఇప్పుడు విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ కుర్చీ ఘటనను తలపించే ఈ తాజా చర్య.. ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అధికార దర్పంతో ఎంపీ

ఏ విశ్వవిద్యాలయానికై నా వైస్‌ చాన్సలర్‌ పదవి అత్యున్నతమైనది. ఆ కుర్చీ కేవలం చాన్సలర్‌ హోదాలో ఉన్న గవర్నర్‌ లేదా నియమితులైన వీసీకి మాత్రమే పరిమితం. ఇది దశాబ్దాల సంప్రదాయం. కానీ, శతాబ్ది ఉత్సవాల సమీక్ష పేరుతో వర్సిటీలోకి అడుగుపెట్టిన ఎంపీ శ్రీభరత్‌.. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి ఏకంగా వీసీ కుర్చీనే ఆక్రమించేశారు. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్‌ నియమించే అత్యున్నత పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని విద్యావేత్తలు మండిపడుతున్నారు. వీసీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ పక్కన సాధారణ కుర్చిలో అసహాయంగా కూర్చుని ఉండగా, ఎంపీ ఆ సీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడం వర్సిటీ స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేయడమే.

గవర్నర్‌ హితవు గుర్తులేదా?

ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. ‘విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన సాగాలి’ అని హితవు పలికారు. ఆ మాటల పచ్చబొట్టు ఇంకా చెరిగిపోకముందే, ఎంపీ తన రాజకీయ ప్రతాపాన్ని వీసీ గదిలో ప్రదర్శించడం విశేషం.

సోషల్‌ మీడియాలో వైరల్‌.. విమర్శల వెల్లువ

ప్రస్తుతం ఎంపీ శ్రీభరత్‌ వీసీ కుర్చీలో కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. గత ఎంపీలు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. గత ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ సీఎండీని కలిసినప్పుడు పక్కన కూర్చుని మాట్లాడిన ఫొటోలను, ఇప్పుడు శ్రీభరత్‌ అధికార కుర్చీని ఆక్రమించిన ఫొటోలను పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక విశ్వవిద్యాలయానికి అధినేతగా ఉంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని మర్చిపోవడం విచారకరం. అధికారులను తన అడుగులకు మడుగులు వత్తించుకునే స్థాయికి దిగజారడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వీసీ సీట్లో కూర్చుని సమీక్షలు జరపడం ద్వారా ఏయూ ప్రతిష్టను దిగజార్చారని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార బలం ఉందన్న గర్వంతో వ్యవస్థలను కించపరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

అలవాటుగా మారిన ’కుర్చీ’ లాట

శ్రీభరత్‌కు ఇలాంటి ‘అధికార దర్పం’ కొత్తేమీ కాదు. గతంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సందర్శన సమయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. దేశ రాష్ట్రపతి ద్వారా నియమితులయ్యే సీఎండీ స్థానానికి ఒక ప్రత్యేకమైన ప్రొటోకాల్‌ ఉంటుంది. కేంద్ర సంయుక్త కార్యదర్శి హోదాలో ఉండే సీఎండీ సీటులో ఎంపీ కూర్చుని రివ్యూ చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. సీఎండీ అతుల్‌భట్‌ను పక్కన కూర్చోబెట్టుకుని ఆర్డర్లు వేయడం చూసి అక్కడి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా వ్యవస్థలను గౌరవించాల్సింది పోయి, వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని కార్మిక వర్గాలు మండిపడ్డాయి.

శతాబ్ది ఉత్సవాల వేళ సమున్నత గౌరవంతో వెలగాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. ఇప్పుడు రాజకీయ అహంకారానికి వేదికై ంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రైవేట్‌ వర్సిటీ అధినేత, ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి.. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని విస్మరించారు. ‘కుర్చీ’ కనిపిస్తే చాలు.. అది ఎవరిదన్న విజ్ఞత మరిచి ‘నేనే బాస్‌’ అన్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు విశాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement