సబ్బవరం: న్యాయ పరిజ్ఞానం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇస్తుందని.. చట్టాలపై అవగాహన ఉంటే పని ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులను అడ్డుకోవడం సులభమవుతుందని కేంద్ర సమాచార కమిషన్ కమిషనర్ సుధారాణి రేలంగి అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారానికి ఉద్దేశించిన ‘పోష్’చట్టం–2013 అమలుపై మంగళవారం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంతీయ న్యాయ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యాలయాల్లో అనుచిత వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తన మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోష్ చట్టం.. నివారణ, నిషేధం, పరిష్కారం అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని ఆమె వివరించారు. అంతర్జాతీయ చట్టాల స్ఫూర్తితో రూపొందిన ఈ చట్టాన్ని మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు మహిళల స్థానంలో వచ్చిన మార్పులను, పోష్ చట్టం నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా నిర్వహించారు. మొదటి సెషన్‌లో పోష్ చట్టంలోని నిబంధనలు, సంస్థాగత వ్యవస్థలపై చర్చించగా.. రెండో సెషన్‌లో చట్టం అమలులో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త సమస్యలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముగింపు సమావేశంలో రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి డాక్టర్ ప్రతిభ రాణి వర్చువల్‌గా ప్రసంగించారు. మహిళలు ప్రతి చోటా భద్రత కోసం పోరాడాల్సి రావడం సమాజ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ అధ్యాపకులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా డాక్టర్ భాగ్యలక్ష్మి, డి.షెర్లీ హెప్సిభా వ్యవహరించారు.
కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి


