మారథాన్‌ కాదు.. మోసగాళ్ల ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

మారథాన్‌ కాదు.. మోసగాళ్ల ప్లాన్‌

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

విశాఖలో ‘ఫేక్‌’ మారథాన్‌ కలకలం

సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

సన్‌రైజ్‌ పేరుతో నిర్వహిస్తున్నట్లు ఏఐ పోస్టర్‌తో ప్రచారం

మోసపోవద్దని ఎస్‌బీఐ అధికారుల సూచన

ఫేక్‌ మారథాన్‌ పోస్టర్‌పై ఉన్న వివరాలు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. సాధారణంగా మారథాన్‌లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంటుంది. ఇదే అదనుగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు.. వైజాగ్‌లో ఈ నెల 19న సన్‌ రైజ్‌ మారథాన్‌ నిర్వహిస్తున్నామంటూ ఏఐ సాయంతో ఒక పోస్టర్‌ను సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌బీఐ స్పాన్సర్‌ చేస్తోందని, జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో జరుగుతోందని నమ్మబలికారు. ఇక ప్రైజ్‌ మనీ విషయంలోనూ భారీ ఆశలు రేకెత్తించారు. 21 కి.మీ.మారథాన్‌ గెలిస్తే రూ.5 లక్షల నగదు బహుమతి, 10 కి.మీ. పరుగులో రూ.3.51లక్షలు, 5 కి.మీ.పరుగులో రూ.2.51 లక్షలు బహుమతులుగా ప్రకటించారు. పాల్గొన్న వారందరికీ ఉచితంగా స్పోర్ట్స్‌ షూస్‌, టీషర్టులు, రిఫ్రెష్‌మెంట్స్‌, గుడీ బ్యాగ్స్‌, మెడల్స్‌, సర్టిఫికెట్లు ఇస్తామని ఊరించారు. రిజిస్ట్రేషన్‌ కోసం 87969 50441 అనే నంబర్‌ను పోస్టర్‌పై పొందుపరిచారు.

సైబర్‌ కేటుగాళ్ల ప్లాన్‌ ఇది

ఈ పోస్టర్‌లోని వివరాలను నమ్మి, అందులోని నంబర్‌కు ఎవరైనా కాల్‌ చేస్తే.. సైబర్‌ కేటుగాళ్లు వెంటనే ఒక లింక్‌ పంపిస్తున్నారు. ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే, అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత వివరాలతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరుతో రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించాలని కోరుతున్నారు. ఒక్కసారి ఈ ఫీజు చెల్లించిన వెంటనే ఆ లింక్‌ పనిచేయడం ఆగిపోతుంది. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది మారథాన్‌ ప్రియులు ఈ మోసానికి గురైనట్లు తెలుస్తోంది.

హెచ్చరిక జారీ చేసిన ఎస్‌బీఐ

ఈ నకిలీ మారథాన్‌ విషయం ఎస్‌బీఐ అధికారుల దృష్టికి వెళ్లడంతో డీజీఎం రాహుల్‌ సంక్రిత్య వెంటనే అప్రమత్తమయ్యారు. తాము ఎలాంటి మారథాన్‌ను నిర్వహించడం లేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న ఆ పోస్టర్‌ పూర్తిగా నకిలీదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్‌ లింక్‌లను క్లిక్‌ చేసి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు. పోస్టర్‌లోని నంబర్‌కు కాల్‌ చేస్తే హిందీలో మాట్లాడి కాల్‌ కట్‌ చేస్తున్నారని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటికే ఈ మోసంపై సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేశామని, ఎస్‌బీఐ కంట్రోలర్స్‌ కూడా ఈ విషయంపై నిఘా పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆకర్షణీయమైన పోస్టులను చూసి తొందరపడి డబ్బులు చెల్లించవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

పరిగెత్తండి.. రూ.5 లక్షలు గెలవండి.. ఈ మాట వింటే ఎవరికై నా ఆశ కలగడం సహజం. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు భారీ బహుమతి అని ఆశపడితే.. చివరకు పైసా వసూల్‌ అవ్వాల్సింది పోయి, పైసా పరేషాన్‌ అవుతుందని బాధితులు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త తరహా మోసానికి తెరలేపారు. విశాఖలో ‘సన్‌ రైజ్‌ మారథాన్‌–2026’ పేరుతో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్టర్‌ ఇప్పుడు నగరంలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పోస్ట్‌ చూసి మోసపోయిన వారు లబోదిబోమంటున్నారు. – సాక్షి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement