కార్మికులకు బాసటగా 75 ఏళ్ల ‘ఈఎస్‌ఐ’ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు బాసటగా 75 ఏళ్ల ‘ఈఎస్‌ఐ’

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

కార్మికులకు బాసటగా 75 ఏళ్ల ‘ఈఎస్‌ఐ’

కార్మికులకు బాసటగా 75 ఏళ్ల ‘ఈఎస్‌ఐ’

మృతుల కుటుంబాలకు పింఛన్‌ మంజూరు పత్రాల అందజేత

తాటిచెట్లపాలెం: కార్మికులకు బహుళ ప్రయోజనాలను అందజేస్తూ.. కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) విజయవంతంగా ముందుకు సాగుతోందని సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌(ఇన్‌చార్జి) సౌమేంద్ర కుమార్‌ సాహూ అన్నారు. సంస్థ స్థాపించి 75వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా మంగళవారం నరసింహనగర్‌లోని ఉప ప్రాంతీయ కార్యాలయంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, కార్మిక యూనియన్ల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పక్షం రోజుల పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1955 మేలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో.. అనంతరం అదే సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నంలో సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. విశాఖపట్నం సబ్‌ రీజినల్‌ కార్యాలయాన్ని 2009 ఫిబ్రవరి 2న ప్రారంభించినట్లు తెలిపారు. బెనిఫిట్స్‌ బ్రాంచ్‌ ఆఫీసర్‌ వి.శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ పథకంలోని వివిధ ప్రయోజనాలు, కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ–2020 వల్ల కార్మికులకు కలిగే లాభాలను వివరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ మాట్లాడుతూ.. కార్మికులందరినీ ఈఎస్‌ఐ పరిధిలోకి తీసుకురావాలని, రూ.21 వేల వేతన పరిమితి ఎత్తేయాలని, అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈఎస్‌ఐ పథకంతో సుదీర్ఘ అనుబంధం కలిగిన బీమాదారులు, విశ్రాంత పింఛన్‌దారులు, ఇతర విభాగాల్లో ఇద్దరేసి చొప్పున ఎంపిక చేసి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఇటీవల విధి నిర్వహణలో జరిగిన ప్రమాదాల్లో మరణించిన బీమాదారుల కుటుంబ సభ్యులకు కుటుంబ పింఛన్‌ జారీ పత్రాలను అందజేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫణీంద్ర, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ కె.దినేష్‌కుమార్‌, లఘు ఉద్యోగ భారతి సెక్రటరీ పవన్‌ జైస్వాల్‌, బీఎంఎస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ ఎం.వి.ఎస్‌.నాయుడు, ఐఎన్‌టీయూసీ జిల్లా జనరల్‌ సెక్రటరీ వి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement