ఆర్టీసీ బస్సు ఢీకొని బ్యాంక్ ఉద్యోగి మృతి
గోపాలపట్నం: జాతీయ రహదారిపై పంజాబ్ హోటల్ జంక్షన్ సమీపంలోని డీమార్ట్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ సైనికోద్యోగి దుర్మరణం పాలయ్యారు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. షీలానగర్ ప్రాంతానికి చెందిన బోనుల పైడినాయుడు (51) మాజీ సైనికోద్యోగి. ఆయన ప్రస్తుతం సీతమ్మధార కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద రాజమండ్రి నుంచి విశాఖ వస్తున్న ఆర్టీసీ బస్సు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి కిందపడిన పైడినాయుడు తల మీద నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


