ముగిసిన విస్ ప్రీ మూట్ కోర్ట్ పోటీలు
● విజేతలకు ట్రోఫీలు అందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్‌ఎన్‌ఎల్‌యూ)లో ఈ నెల 20 నుంచి మూడు రోజులపాటు జరిగిన విశ్వవిద్యాలయ విస్ ప్రీ మూట్ కోర్టు రెండో ఎడిషన్ పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ప్రపంచ వ్యాప్తం ప్రఖ్యాతిగాంచిన విల్లెమ్ సి విస్ ఇంటర్నేషనల్ కమర్షియల్ అర్బిట్రేషన్ మూట్ కోర్టు పోటీలకు సన్నాహకంగా నిర్వహించే ఈ పోటీలను డీఎస్‌ఎన్‌ఎల్‌యూలో మాత్రమే నిర్వహించడం విశేషం. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఫైనల్ రౌండ్‌కు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని ముఖ్య సబ్జెక్టుగా విస్ ప్రీ మూట్ నిర్వహించడాన్ని అభినందించారు. వర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాశరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని ప్రత్యేక అధ్యయన రంగంగా అభివృద్ధి చేసేందుకు విశ్వవిద్యాలయం కృషి చేస్తోందన్నారు. ఫైనల్‌లో విజేతలుగా నిలిచిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ద్వితీయ స్థానంలో నిలిచిన జిందాల్ గ్లోబల్ లా స్కూల్ జట్లకు జస్టిస్ హరినాథ్ చేతుల మీదుగా ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో డ్యూ అసోసియేట్స్ భాగస్వామి గణేష్ చందు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రతినిధులు నవీన్ అహుజా, వర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాథ్ మదాసు, ఫ్యాకల్టీ చైర్‌పర్సన్ డాక్టర్ పి.జోగినాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


