పదో తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని 133 కేంద్రాల్లో మొత్తం 30,633 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతులు కల్పించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అక్రమాలకు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు చురుగ్గా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల భద్రత, సమాధాన పత్రాల తరలింపులో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక్షన్ అమలు చేస్తూ, విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2 నుంచి 13 వరకు, పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి 28 వరకు జరగనున్నాయని కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇంటర్ పరీక్షలకు 1,247 మంది, పదో తరగతి పరీక్షలకు 1,141 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఈ పరీక్షల కోసం కేటాయించిన కేంద్రాలలో నిబంధనల ప్రకారం ఇన్విజిలేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, విద్యుత్ , విద్యాశాఖ అధికారులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


